: మనందరికీ మూలం అరుణగ్రహమట!
మనందరి మూలాలు అరుణ గ్రహంలోనే వున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకూ అసలు అరుణగ్రహంపై జీవం ఉందా? అనే విషయంపై ఒకపక్క రోవర్లను పంపి పరిశోధనలు సాగిస్తుండగా, అసలు భూమిపై జీవి ఆవిర్భవించడానికి కారణం అరుణగ్రహమేనని పరిశోధకుల పరిశోధనలో తేలిందట. ఈ మేరకు తమ పరిశోధనలో కొత్త ఆధారాలు లభించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికాలోని వెస్ట్ హైమర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో అంగారక గ్రహం నుండే భూమిపైకి జీవం వచ్చిందని తేలింది. జీవం ఆవిర్భావానికి మాలిబ్డినం అనే మూలకానికి సంబంధించిన ఆక్సీకరణం పొందిన రూపం కీలక పాత్ర పోషించిందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన స్టీఫెన్ బెన్నెర్ తెలిపారు. ఈ మాలిబ్డినం అనేది అంగారకుడిపైనే ఉండేదని, భూమిపై లభించేది కాదని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు.
ఈ విషయం గురించి స్టీఫెన్ బెన్నెర్ మాట్లాడుతూ జీవం ప్రారంభమైన తొలినాళ్లలో ఆ తరహా మాలిబ్డినం భూమిపై ఉండేది కాదని, ఎందుకంటే 300 కోట్ల సంవత్సరాల కిందట భూమి ఉపరితలంపై చాలా తక్కువగా ఆక్సిజన్ ఉండేదని, అదే సమయంలో అరుణగ్రహంపై మాత్రం పుష్కలంగా ఉండేదని, అక్కడినుండి భూమిపైకి వచ్చిపడ్డ ఉల్క ద్వారా భూమిపైకి జీవం చేరిందనడానికి ఇది ఒక ఆధారమని ఆయన తెలిపారు. దీనికితోడు బోరాన్ కూడా కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు.
తొలిరోజుల్లో భూమి మొత్తం నీటితో నిండిపోయి ఉండేదని, అందువల్ల అవసరమైన స్థాయిలో బోరాన్ పోగుపడడానికి వీలు కాలేదని, అంగారకుడిపై నీరు ఉన్నా కూడా భూమి మీదున్న స్థాయిలో లేదని ఆయన తెలిపారు. అంగారకుడిపైనుండి వచ్చిన ఉల్కను ఇటీవల విశ్లేషించినప్పుడు ఆ గ్రహంపై బోరాన్ ఉన్నట్టు తేలిందని, ఆక్సీకరణం చెందిన మాలిబ్డినం కూడా అక్కడినుండే వచ్చి ఉంటుందని తాము భావిస్తున్నట్టు తెలిపారు. మనమంతా అంగారకుడిపైనుండి వచ్చామనడానికి ఆధారాలు లభిస్తున్నాయని, అరుణుడిపై జీవం ఏర్పడి, శిల ద్వారా భూమిమీదకు వచ్చి ఉంటుందని అర్ధమవుతోందని బెన్నెర్ చెబుతున్నారు.