: షుగరుతో మెమరీ పవర్ తగ్గుతుంది!
షుగరు వ్యాధి మన శరీరాన్ని క్రమేపీ శక్తి హీనం చేస్తుంది. మనిషిని పీల్చివేస్తుంది. అయితే ఇలాంటి వ్యాధిని అదుపులో ఉంచుకోకుంటే దాని ప్రభావం మెదడుపై కూడా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. షుగరువ్యాధి ఉన్నవారు రక్తంలోని గ్లూకోజు మోతాదులను నియంత్రణలో ఉంచుకోకుంటే దాని ప్రభావం మెదడుపై పడి విషయ గ్రహణ సామర్ధ్యం తగ్గుతున్నట్టుగా శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు షుగరుకు, మెదడు పనితీరుకు నేరుగా సంబంధం ఉన్నట్టు వారి తాజా పరిశోధనల్లో గుర్తించినట్టు వెల్లడించారు. సాధారణంగా షుగరు వ్యాధి మూలంగా గుండెజబ్బుల వంటి పలు సమస్యలు మాత్రమే ఉంటాయని ఇప్పటి వరకూ భావించేవారు. అయితే ఈ వ్యాధి మెదడు పనితీరును కూడా మందగించేలా చేస్తున్నట్టు ఈ అధ్యయనంలో బయటపడింది. షుగరు వ్యాధి లేనివారితో పోలిస్తే ఈ వ్యాధితో బాధపడే వృద్ధుల్లో మెదడు సామర్ధ్యం గణనీయంగా పడిపోయినట్టు 'సిడ్నీ మెమరీ అండ్ ఏజింగ్' అధ్యయనంలో వెల్లడైంది. 70 నుండి 90 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 880 మందిపై రెండేళ్ల పాటు పరిశోధకులు అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు.
మన రక్తంలోని గ్లూకోజు మోతాదులను అదుపులో ఉంచుకుంటే మెదడు సామర్ధ్యం తగ్గే ముప్పు కూడా తగ్గుతున్నట్టు ఈ పరిశోధనల్లో తేలడం గమనార్హం. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కేథరీన్ సమరస్ మాట్లాడుతూ కేవలం మధుమేహమే కాదు... ముందస్తు మధుమేహం కూడా విషయగ్రహణ శక్తి క్షీణించడానికి దోహదం చేస్తోందని అన్నారు. కాబట్టి ముందస్తు మధుమేహం దశలో ఉన్నవారు కూడా మధుమేహం బారినపడకుండా తగు నివారణ చర్యలు తీసుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.