: ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే మేలు
అదేంటి... బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే మేలంటున్నారని మీరు ఆశ్చర్యపోతున్నారా... ఇవి ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియా కాదులెండి. మనలోనే ఉంటూ మనకు మేలు చేసే బ్యాక్టీరియా కాబట్టే ఇలాంటివి ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా మన పేగుల్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి మనల్ని పలు రకాలైన జబ్బులనుండి కాపాడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఇలా మేలు కలిగించే బ్యాక్టీరియా తగ్గితే మనకు ఆరోగ్య పరమైన సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మన పేగుల్లోని బ్యాక్టీరియా మనకు చాలా వరకూ మేలు చేస్తాయి. అయితే వీటిగురించి శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని గుర్తించారు. ఏమంటే అసలు మన పేగుల్లోని బ్యాక్టీరియాకు, మన శరీరానికి సంబంధించిన మొత్తం ఆరోగ్యానికి సంబంధం ఉందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఒక అంతర్జాతీయ పరిశోధకులతో కూడిన 'మెటా హెచ్ ఐటీ' బృందం ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో పేగుల్లోని బ్యాక్టీరియా రకాలు ఎంత ఎక్కువగా ఉంటే మన ఆరోగ్యం అంత మెరుగ్గా ఉన్నట్టని తేలింది. పేగుల్లో బ్యాక్టీరియా రకాలు తక్కువగా ఉండడం వల్ల దాని ప్రభావం మన ఆరోగ్యంపై వివిధ రకాలుగా ఉంటున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. పేగుల్లో బ్యాక్టీరియా తక్కువగా ఉన్నవారు గుండెజబ్బులు, మధుమేహం వంటి సమస్యల బారినపడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
ఈ విషయాన్ని గురించి పరిశోధకుల్లో ఒకరైన జెరోయెన్ రేస్ మాట్లాడుతూ ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమని, ప్రస్తుతం కనిపిస్తున్న వివిధ జబ్బుల నివారణ, చికిత్సల్లో ఇది గణనీయంగా ప్రభావం చూపవచ్చని, కానీ దీనిపై భారీ స్థాయిలో మరింత లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు.