: అవసరమైతే..'రాజీ'నామాలకు సిద్ధం: సీమాంధ్ర ఎంపీలు
ఏపీఎన్జీవోలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిస్తుంటే వారికి రాజకీయ నాయకుల సహకారం అసలు అందడం లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ హస్తినలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలతో జరిగిన భేటీనే. ఏపీఎన్జీవోలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఏ రకమైన హామీ ఇవ్వకపోవడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీనామాలకు ఏపీఎన్జీవోలు డిమాండ్ చేశారు. దానికి వారు అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని, అయితే రాజీనామాల వల్ల ఒరిగేది ఏదీ ఉండదని వారికి స్పష్టం చేసినట్టు సమాచారం.
ఎంపీ అనంత వెంకటరామ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు, రేపు చర్చించుకుని రాజీనామాలపై ఒక నిర్ణయానికి వస్తామని, అవసరమైతే రాజీనామాలకు వెనకాడేది లేదని తెలిపారు. అయితే తాము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని ఎంపీ సాయి ప్రతాప్ తెలిపారు. రాజీనామాలతో కేంద్రంపై ఒత్తిడి తేవాలనే డిమాండుపై మంత్రులు, ఎంపీలు అందరం కూర్చుని చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి పళ్లంరాజు తెలిపారు.