: మోడీ బీజేపీని వదిలేస్తే.. ఆయనకు మద్దతిస్తా: అన్నా హజారే
బీజేపీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్న నరేంద్రమోడీకి కీలకమైన వ్యక్తి నుంచి నైతిక మద్దతు లభించింది. ప్రముఖ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే మోడీకి మద్దతు ఇవ్వడానికి సంసిద్ధతను ప్రకటించారు. కాకపోతే, మోడీ బీజేపీ నుంచి బయటకు రావాల్సి ఉంటుందనే షరతు పెట్టారు. ఈమేరకు అమెరికా మీడియా అన్నా స్పందనను ప్రచురించింది. రెండు వారాల అమెరికా పర్యటనను పూర్తి చేసుకుని అన్నా హజారే నిన్న భారత్ కు తిరుగుముఖం పట్టారు.
తన పర్యటనలో భాగంగా అమెరికాలోని భారతీయ విద్యావంతులు, మేధావులతో సమావేశం అయ్యారు. తాను రాజకీయ పార్టీలను విశ్వసించనని స్పష్టం చేశారు. మోడీ కూడా ఒక పార్టీలో భాగమేనని చెప్పారు. అయితే, మోడీ ఒంటరిగా ఉంటే? అంటూ ఒకరు ప్రశ్నించారు. మోడీ బీజేపీ నుంచి బయటకు వస్తే సంతోషంగా అతడిని అంగీకరిస్తానంటూ బదులిచ్చారు. డెలావేర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముక్తేదార్ ఖాన్ హఫింగ్ టన్ పోస్ట్ లో ఈ మేరకు కథనం రాశారు.