: మేఘాలను కృత్రిమంగా సృష్టించవచ్చు
కృత్రిమంగా వర్షాలను కురిపించడానికి మేఘాలపై వివిధ రసాయనాలను చల్లి, కృత్రిమ వర్షాలను కురిపిస్తున్నాం. అయితే మేఘాలను కూడా కృత్రిమంగా సృష్టించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు మాత్రమే కాకుండా మేఘాలను కూడా కృత్రిమంగా సృష్టించడం నిజంగా శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు.
జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జీన్‌పీర్‌వోల్ఫ్, జెరోమ్ కస్పారియన్ అనే శాస్త్రవేత్తలు లేజర్ కిరణాల ద్వారా కృత్రిమంగా మేఘాలను సృష్టించవచ్చని చెబుతున్నారు. అత్యంత తీవ్రమైన పరారుణ, అతినీలలోహిత లేజర్ కాంతి పుంజాలను వాతావరణంలోకి పంపించడం ద్వారా నీటి అణువులు గడ్డకట్టేలా చేయవచ్చని తద్వారా మేఘాలను కృత్రిమంగా ఏర్పరచవచ్చని తెలిపారు. ఉరుములు, మెరుపులతో ఆకాశం దద్దరిల్లే సమయంలో పిడుగులు పడే దిశను కూడా లేజర్ పుంజాలతో మళ్లించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
వచ్చే నెలలో జెనీవాలో లేజర్లతో వాతావరణంలో మార్పులను తీసుకురావడం అనే అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారని, ఈ అంశంపై మరిన్ని పరిశోధనలను ప్రోత్సహించే దిశగా ఈ సదస్సు జరుగుతుందని వారు తెలిపారు. కృత్రిమ మేధోమధనం పేరుతో ఇప్పటికే పలు దేశాలు ఆకాశంలో రసాయనాలను చల్లి మేఘాలను సృష్టించే ప్రయత్నాలు చేశాయని, అయితే ఈ ప్రక్రియకన్నా కూడా లేజర్ల ద్వారా జరిపే ప్రయత్నం మరింత సులువుగా, కచ్చితమైన ఫలితాలను సాధించే విధంగా ఉంటుందని వోల్ఫ్, కస్పారియన్ అంటున్నారు.