: కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటే రూపాయి పతనం ఆగుతుంది: బీజేపీ
రూపాయి పతనానికి ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమొక్కటే మార్గమని అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ హయాంలో ఆర్ధిక స్థితి మిణుకుమిణుకుమంటోందని విమర్శించారు. రూపాయి పతనం ఆగాలన్నా, స్టాక్ మార్కెట్లు కోలుకోవాలన్నా సర్కారు రాజీనామా చేసి తాజా ఎన్నికలకు వెళ్ళాలని సూచించారు. అలాగాకుండా, మరికొద్ది నెలలు ఇదే ప్రభుత్వం కొనసాగితే మాత్రం ప్రజలు అష్టకష్టాలు పడడం ఖాయమని చెప్పారు.