: 'తుఫాన్' ఫ్లెక్సీ తగలబెట్టారు!
రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం తుఫాన్ నిన్ననే పాటల వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర బృందం చెబుతుండగా, అది వాస్తవరూపం దాల్చే అవకాశాలు కనిపించడంలేదు. ఎందుకంటే, సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో మెగా హీరోల చిత్రాలను తప్పకుండా అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీలు ఇప్పటికే హెచ్చరించాయి. కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా చేస్తేనే వారి సినిమాలను ఆడనిస్తామని జేఏసీలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో తాజాగా విజయనగరం జిల్లా కోట జంక్షన్ లో సమైక్యవాదులు 'తుఫాన్' ఫ్లెక్సీని తగలబెట్టారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, అప్పటికి పరిస్థితులు చక్కబడడం సందేహమే. దీంతో, ఆ సినిమా రిలీజ్ పైనా అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయి.