: 'లగడపాటీ.. గో బ్యాక్'
విజయవాడలో విద్యార్ధి గర్జనలో పాల్గొన్న అనంతరం లగడపాటి రాజగోపాల్ కు దారుణ అవమానం ఎదురైంది. సమైక్య ఉద్యమానికి అన్నీ తానే అనుకున్న లగడపాటిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. విద్యార్ధి గర్జన నుంచి ఆర్టీసీ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన లగడపాటి రాజగోపాల్ ను తక్షణం వెళ్లిపోవాలంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. పదవులను పట్టుకుని వేలాడుతూ రాజకీయ నాయకులు నాటకాలు ఆడుతున్నారని, పదవిని వదిలి వచ్చి ఉద్యమంలో చేరితే అప్పుడు గౌరవమిస్తామని వారు స్పష్టం చేశారు. దీంతో దీక్షా శిబిరాన్ని వీడిన లగడపాటి తనకు అవమానం జరిగిందని బందరు రోడ్డుపై బైఠాయించారు. ఉద్యమంలోకి వచ్చేందుకు తనకు అభ్యంతరం లేదని, ఇప్పుడే వస్తే తానే ఉద్యమాన్ని చేయిస్తున్నానని అంటారని, అందుకే సరైన సమయంలో ఉద్యమంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నానని లగడపాటి తెలిపారు. పోలీసులు ఆయనను శాంతింపజేసి అక్కడినుంచి పంపించారు.