: మనిషి రికార్డును ఈ టెడ్డీ తిరగరాసింది!
అనగనగా ఒక రోబో టెడ్డీ బేర్... అంటే రోబో ఎలుగు అన్నమాట... అది ఎంచక్కా స్కై డైవింగ్ చేసింది. అది సాదాసీదాగా కాదు... అప్పటికే ఒక సాహసి సృష్టించిన రికార్డును ముక్కలు చేసేలా చేసింది మరి. దీంతో ఇది రికార్డులోకి ఎక్కేసింది.
డేవిడ్ అకర్మన్ అనే శాస్త్రవేత్త ఒక రోబో టెడ్డీ బేర్‌ను తయారు చేశారు. దీన్ని ఇలా స్కైడైవింగ్ చేయించి రికార్డుల్లోకి ఎక్కేలా చేశాడు. ఈ రోబో టెడ్డీ పేరు బాబేజ్. ఇది మంగళవారం నాడు 39 కిలోమీటర్ల ఎత్తులోనుండి స్కైడైవింగ్ చేసేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికే గత ఏడాది అక్టోబరులో ఫెలిక్స్ బామ్‌గార్‌ట్నర్ అనే సాహసి చాలా ఎత్తునుండి డైవింగ్ చేసి రికార్డు సృష్టించాడు. దీన్ని ఈ రోబో టెడ్డీ బద్దలుకొట్టేసి, అక్కడ తన పేరును రాసేసుకుంది. ఈ రోబో టెడ్డీని దాని సృష్టికర్త 'రాప్స్‌బెరీ పై' అనే అతి సూక్ష్మమైన కంప్యూటర్ సాయంతో నడిపాడు. తర్వాత ముందుగా ఒక పెద్ద బలూన్ సాయంతో పైకి వెళ్లిన బాబేజ్ అక్కడినుండి 39 వేల మీటర్ల పైకి ఎగసింది. దీంతో ఇప్పటి వరకూ 38,969 కిలోమీటర్ల దూరం స్కైడైవింగ్ చేసి రికార్డు సృష్టించిన ఫెలిక్స్ రికార్డును ఈ రోబో టెడ్డీ బద్దలు చేసింది. ఫెలిక్స్ తన భుజంపై కెమెరాను అమర్చుకుని తన రికార్డును తానే నమోదు చేసుకున్నాడు. అలాగే బాబేజ్ కూడా తన ప్రయాణాన్ని ఫోటోలు, వీడియోలు తీసుకుంది. అంతేకాదు ఎత్తుకు, దిశకు తగ్గట్టుగా బాబేజ్ తన దేహాన్ని తానే మార్చుకుంటుంది కూడా. అలా పెద్ద రికార్డును తన ఖాతాలో వేసేసుకుంది.