: మీరూ ఒక ఉపగ్రహాన్ని కొనుక్కోవచ్చు
ఉపగ్రహాలను తయారు చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. దాన్ని బోలెడంతమంది శాస్త్రవేత్తలు రాత్రీపగలు శ్రమపడి తయారు చేస్తారు. పైగా దాన్ని అంతరిక్షంలోకి పంపడానికి కూడా చాలా ప్రయాసతో కూడుకున్న పని. అయితే మీరు ఇలా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలనుకుంటున్నారా... మీరు కూడా చక్కగా ఒక ఉపగ్రహాన్ని కొనుక్కొని ఎంచక్కా అంతరిక్షంలోకి పంపేయొచ్చు. అమ్మో... ఉపగ్రహాన్ని కొనడం అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్నది అనుకుంటున్నారా... అదేం కాదు... కేవలం ఇరవై వేల రూపాయలు ఉంటే చాలు... మీరూ ఒక ఉపగ్రహాన్ని కొనుక్కోవచ్చు. ఉత్తుత్తిది కాదు... నిజమైన ఉపగ్రహాన్ని మీరు సొంతం చేసుకోవచ్చంటున్నారు పరిశోధకులు.
ఒక బ్రిటిష్ కంపెనీ చిన్న సైజు ఉపగ్రహాన్ని తయారు చేసింది. ఇది ఎంత ఉంటుంది అంటే ఒక సిడి అంత పరిమాణంలో ఉంటుంది. దీనిపేరు 'పాకెట్ స్పేస్‌క్రాఫ్ట్'. దీన్ని ఔత్సాహికులైన ఖగోళ పరిశోధకులు తమ సొంతం చేసుకుని అంతరిక్షంలోకి పంపవచ్చట. దీని ధర కేవలం 20 వేల రూపాయలు మాత్రమే (199పౌండ్లు). ఇలాంటి ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపడం సాధ్యమేనని ఈ కంపెనీవారు చెబుతున్నారు. కాగితం మందంతో, సిడి అంత పరిమాణంతో ఉండే ఈ తేలికైన ఉపగ్రహాలను చక్కగా అంతరిక్షంలోకి పంపితే అవి ఏడాది తర్వాత అంతరిక్షంలోకి చేరతాయని కంపెనీవారు చెబుతున్నారు. ఇలాంటి ఉపగ్రహాలను కొన్ని వేల సంఖ్యలో చంద్రుడిపైకి పంపే లక్ష్యంతో ఈ కంపెనీ కసరత్తు చేస్తోంది. 2015 జూన్‌లో వీటిని భూమిపైనుండి ప్రయోగిస్తే సరిగ్గా ఏడాది తర్వాత 2016 జూన్‌లో అవి చంద్రుడిని చేరుకుంటాయని సంస్థ చెబుతోంది.