: వెంకీ ఆవిష్కరించిన 'తుఫాన్' ఆడియో
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన ద్విభాషా చిత్రం 'తుఫాన్' ఆడియో రిలీజ్ నేడు హైదరాబాదులో వైభవంగా జరిగింది. శిల్ప కళావేదికలో ఈ పాటల వేడుక కొద్దిసేపటి క్రితం ముగిసింది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఆడియో రిలీజ్ చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేశారు. కార్యక్రమం మధ్యలో జరిగిన డ్యాన్స్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వెంకీ, రామ్ చరణ్ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు.
రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీహరి, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీహరి పోషించిన పాత్రను హిందీ వెర్షన్లో సంజయ్ దత్ పోషించారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్, ఆనంద్ రాజ్ ఆనంద్, మీట్ బ్రదర్స్ అంజన్ సంగీతం అందించారు. పునీత్ మెహ్రా, సుమీత్ మెహ్రా సోదరులు నిర్మాతలు. కాగా, ఈ సినిమా అలనాటి 'జంజీర్' కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో 'జంజీర్' సినిమా హిట్ తో అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజిని సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్ తాజా సినిమా 'జంజీర్' పేరుతోనే ఉత్తరాదిన రిలీజవుతోంది.