: వీడొక భర్త..!


మనుషుల్లో మమతానురాగాలు క్రమేణా అడుగంటిపోతున్నాయి. ఆర్ధిక బంధాలకిచ్చినంత ప్రాముఖ్యత మానవ సంబంధాలకివ్వడంలేదు. అది స్నేహితుడైనా సరే, భార్యైనా సరే. స్వార్థమే ముఖ్యమనుకుంటున్నారు. తమిళనాడులో ఓ వ్యక్తి భార్యాపిల్లలను పోషించడం భారంగా భావించి, వాళ్ళకోసం తాను కష్టపడడమేంటని తలపోసి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా అడవుల పాల్జేశాడు.

వివరాల్లోకెళితే.. రామనాథపురం జిల్లాలో వసంత్ కుమార్ అనే వ్యక్తికి పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నారు. ఆ ప్రాంతంలో అతగాడు పరమ పిసినారిగా ఖ్యాతికెక్కాడు. కనీసం ఇంటి అద్దెను చెల్లించేందుకు కూడా డబ్బులు బయటికి తీయకుండా వాయిదాలు వేస్తూ వచ్చాడు. దీంతో, ఇంటి యజమాని తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచడంతో ఎటూ పాలుపోని వసంత్ కుమార్ భార్యాపిల్లలను వదిలించుకునేందుకు ఎత్తుగడ వేశాడు. పిక్నిక్ అని చెప్పి వారిని ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడే వదిలేసి చక్కా వచ్చేశాడు.

పాపం, ఆ నట్టడవిలో ఆ స్త్రీ తన ఇద్దరు పిల్లలను పొదివి పట్టుకుని అలాగే కూర్చుండిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియదు, క్రూర మృగాల భయం మరోవైపు. చివరికి కొందరు వ్యక్తులు వారిని చూసి అక్కడినుంచి తరలించారు. ప్రస్తుతం వారు ప్రభుత్వ వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్ళి నాడు ప్రమాణాలు చేసి భార్య చేయి అందుకుని.. తనకు భారమనిపించిన నాడు ఆమెను వదిలించుకునేందుకు సైతం సిద్ధపడ్డ వీడొక భర్త..!

  • Loading...

More Telugu News