: చిన్న చిట్టి... పెద్ద సాయం...


చిట్టి రోబో గుర్తుందా... ఎంచక్కా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడుతాడు... అయితే ఇలాంటిదే ఒక బుల్లి చిట్టిని శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇది రోబో చిట్టిలాగా ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎగిరి తీసుకువచ్చి కాపాడలేకపోవచ్చు... కానీ అలా చిక్కుకున్న వారి వివరాలను చక్కగా తెలియజేస్తుంది. దీంతో వారిని కాపాడేందుకు ప్రత్యేక సహాయక చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని దీన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక బుల్లి ఆటోపైలట్‌ వ్యవస్థను తయారు చేశారు. రిమోట్‌ సాయంతో నడిచే దీనిపేరు లీసా. దీని బరువు 1.9గ్రాములు, పొడవు కేవలం రెండు సెంటీమీటర్లు, వెడల్పు రెండు సెంటీమీటర్లు మాత్రమే. ఇంత బుల్లి పరికరాన్ని మరో బుల్లి హెలికాప్టర్‌లో అమర్చి, దానికి కెమెరాలను, సెన్సర్లను అనుసంధానించి విపత్తు నిర్వహణ వంటి సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చట. దీనిలో ఉండే సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఇది భూమిమీద నియంత్రణ కేంద్రంతో అనుసంధానమై ఉంటుందని ఈ పరిశోధనా బృందానికి సారధ్యం వహించిన బార్ట్‌రీమ్స్‌ చెబుతున్నారు.

ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు లీసా చక్కగా ఉపయోగపడుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. తాము రూపొందించిన లీసాను అగ్నిమాపక సిబ్బందితోబాటు వ్యవసాయదారులు కూడా ఉపయోగించుకునే విధంగా రూపొందించేందుకు కృషి చేస్తున్నట్టు రీమ్స్‌ చెబుతున్నారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినపుడు అగ్నిమాపక సిబ్బంది లీసాతో కూడిన హెలికాప్టరును ప్రమాదం జరిగిన భవనం లోపలికి పంపించి లోపలి ప్రమాదకర పరిస్థితులను గురించి అంచనా వేయవచ్చని, అలాగే రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలోని పంటల పరిస్థితులను కూడా లీసా సాయంతో తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News