: సస్పెండైనా సమస్యలను సభలో ప్రస్తావిస్తాం: టీడీపీ ఎంపీలు
రేపు పార్లమెంటులో మళ్లీ తమ సమస్యలను ప్రస్తావిస్తామని రాజ్యసభ నుంచి సస్పెండైన టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు తెలిపారు. సస్పెన్షన్ అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని, అది సభ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించిన తమను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ఓట్ల రూపంలో ప్రజలు ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని వారు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా రాజీనామా చేస్తే కేంద్రం ఎందుకు దిగిరాదని టీడీపీ ఎంపీలు ప్రశ్నించారు.
సీమాంధ్ర నేతలు ప్రజల మనోభావాలను ప్రతిబింబించాలని సూచించారు. తమ ప్రాంత ప్రజల ఇబ్బందులపై ఎంత చెబుతున్నా సభలో ఎవరూ వినిపించుకోలేదని టీడీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో తమ ప్రాంత సమస్యలపై నిలదీస్తే తమని సస్పెండ్ చేశారని, ఆంధ్రప్రదేశ్ సభ్యుల మాట వినబడకుండా గొంతు నొక్కేస్తున్నారని టీడీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు.