: రెండు నెలల్లోనే బంగారం ధరల్లో ఎంత తేడా!
బంగారం ధర మరింత పడిపోతుందటగా..! రెండు నెలల క్రితం 10 గ్రాముల బంగారం ధర 25,000 రూపాయల దగ్గర ఉన్నప్పుడు చాలా మంది అనుకున్న మాటలివి. కానీ, అక్కడి నుంచి బంగారం ధరలు మళ్లీ ఎగువకు ప్రయాణం కట్టాయి. ఇప్పడు చూస్తే 10 గ్రాముల ధర 32,000వేల రూపాయలకు చేరింది. రెండు నెలల్లోనే 25 శాతం పెరిగింది. ఇంకో 1000 రూపాయలు పెరిగితే బంగారం ఆల్ టైమ్ హైకి చేరినట్లే. బంగారం ధర ఇలా యూ టర్న్ తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ధరల పెరుగుదలకు గల కారణాలను చూద్దాం.
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఔన్స్ (32 గ్రాములు) 1203 డాలర్ల నుంచి ప్రస్తుతం 1390 డాలర్ల వద్దకు చేరింది. 1203 డాలర్ల వద్ద బంగారానికి బలమైన కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎందుకుంటే 10 గ్రాముల బంగారం వెలికితీయడానికి అయ్యే ఖర్చు 1200 డాలర్లుగా ఉంటుంది. ఇంతకంటే ధర పడిపోతే మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేస్తాయి. ఈ కారణమే బంగారం ధరలు గణనీయంగా కోలుకోవడానికి దోహదపడ్డాయి.
మరోవైపు భారతీయ కరెన్సీ రూపాయి విలువ ఈ రెండు నెలల కాలంలో 15 శాతానికి పైగా పడిపోయింది. 56 నుంచి 64కు చేరుకుంది. బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం గనుక రూపాయి విలువ తగ్గినప్పుడు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వం కరెంటు ఖాతా లోటు పెరిగిపోతుందంటూ బంగారం దిగుమతులపై నానా రకాల ఆంక్షలు విధించడం వల్ల సరఫరా తగ్గి రేట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో సమీప కాలంలో బంగారం ధరలు రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ ధరలపై ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.