: 2012లో లక్ష అత్యాచార కేసులు పెండింగ్
నానాటికీ మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కేసులు నమోదవుతున్నా, సత్వరమే పరిష్కరింపబడడం లేదు. ఒక్క 2012లోనే దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న లక్ష అత్యాచార కేసులు పెండింగ్ లో ఉన్నాయని న్యాయశాఖ విడుదల చేసిన లెక్కలు తేటతెల్లం చేశాయి. అయితే, ఇందులో కేవలం 14,700 (14.5 శాతం) కేసుల్లో విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. ఇందులో 3,563 మంది దోషులుగా రుజువైతే, 11,500 మందికి పైగా నిర్దోషులుగా దర్జాగా బయటపడ్డారట. దాంతో, విచారణలపై పూర్తిగా విశ్వాసం సన్నగిల్లినట్లు కనిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో నమోదైన అత్యాచార కేసులని సంఖ్యల వారీగా పరిశీలిస్తే.. 2012లో ఒక్క ఢిల్లీలో 2,007 కేసులపై విచారణ జరుగుతుండగా, 1,404 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 15,197 అత్యాచార కేసులు విచారణలో ఉంటే 14,000 పెండింగ్ కేసులతో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇక మహారాష్ట్రలో 14,414 కేసులు విచారణలో ఉండగా 13,388 కేసులు, మధ్యప్రదేశ్ లో నమోదైన 11,273 కేసుల్లో 8,425 కేసులు ఎటువంటి విచారణ లేకుండా పెండింగ్ లో ఉన్నాయని లెక్కలు వివరించాయి. అరుణాచల్ ప్రదేశ్ లో 548 కేసులకు కేవలం 30 కేసుల్లో తీర్పు వెలువడింది. కాగా, మిజోరామ్, ఉత్తరాఖండ్ లో అత్యాచార ఘటనల శాతం కొంచెం తక్కువగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.