: మమ్మీ ఒక్కటే శవపేటికలు ఎనిమిది!
ఈజిప్టు మమ్మీలను గురించి తెలియనివారుండరు. చనిపోయిన వారిని వివిధ రసాయనాలు పూసి వారిని భద్రంగా శవపేటికల్లో ఉంచుతారు. పలు తవ్వకాల్లో ఈజిప్టులో ఇలాంటి శవపేటికలు బయటపడుతుంటాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలను పరిశీలిస్తే ఒక మమ్మీకి శవపేటికలు అనేవి కేవలం ఒక్కటే కాకుండా సమాజంలో చనిపోయిన వ్యక్తి హోదాను బట్టి సంఖ్య పెరుగుతూ ఉంటుందట. మరణించిన వ్యక్తి హోదాను బట్టి సదరు వ్యక్తి శవాన్ని నాలుగైదు శవపేటికల్లో ఉంచుతారని తేలింది.
నార్వే ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందిన ఈజిప్టు పరిశోధకుడు ఆండర్స్ బెట్టుమ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో మమ్మీలకు సంబంధించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అధ్యయనంలో ప్రాచీన కాలంలో ఈజిప్టులో మరణించిన వ్యక్తులకు సమాజంలోని స్థానాన్ని బట్టి వారికి కనీసం నాలుగు లేదా ఐదు శవపేటికలను వాడతారని తేలింది. సమాజంలో సదరు మరణించిన వ్యక్తి హోదాను బట్టి వారి కొరకు ఉపయోగించే శవపేటికల సంఖ్య ఉంటుందనే విషయం ఆండర్స్ పరిశోధనల్లో తేలింది.
ఈజిప్టుల చిన్నారి రాజు టుటాంకుమన్ (1334`24) మరణిస్తే అతని శవాన్ని మమ్మీగా చేసి దాన్ని ఎనిమిది శవపేటికల్లో పెట్టారట. ముందుగా సదరు మమ్మీని ఉంచడానికి చిన్న శవపేటికను వాడతారు, దాన్ని మరో శవపేటికలో, దాన్ని మరో శవపేటికలో... ఇలా పలు శవపేటికలను ఉపయోగించి సదరు మమ్మీని భద్రం చేస్తారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆండర్స్ మాట్లాడుతూ ఈ ఆచారం సమాజంలోని ముఖ్యులను రోజువారి లోకానికి దూరంగా... దైవానికి చేరువగా చేర్చడమే ఈ శవపేటికల పొరల లక్ష్యమని విశ్లేషిస్తున్నారు.