: మీ అనుమానాలను ఇది తీరుస్తుంది!
భర్తకు భార్యలపైన, భార్యలకు భర్తలపైన అనుమానం వస్తుంటుంది. అలాగే బాయ్‌ఫ్రెండ్‌కు తన గర్ల్‌ఫ్రెండ్‌పైన గర్ల్‌ఫ్రెండ్‌కు తన బాయ్‌ఫ్రెండ్‌పైన అనుమానం వస్తుంటుంది. అవతలివారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో... అనే అనుమానం వస్తుంటుంది. ఇలాంటి వారి కోసం ఒక కొత్తరకం యాప్‌ను తయారుచేశారు. ఈ యాప్‌పేరు 'రస్ట్రీడార్ డె నమోరడోస్'. ఈ పేరు పోర్చుగీసు పదం, దీనికి అర్ధం బాయ్‌ఫ్రెండ్ ట్రాకర్. ఈ యాప్‌ను తమ గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసేస్తే చాలు... ఇక ఆమెకు తెలియకుండానే ఆమె ఎక్కడికి వెళుతోంది? ఎవరితో మాట్లాడుతోంది? ఏం మాట్లాడుతోంది వంటి అన్ని విషయాలను బాయ్‌ఫ్రెండ్‌కు తెలిసిపోతుందట. ఎవరికి ఎలాంటి మెసేజ్‌లు పంపుతోంది, ఎవరిని కలిసి వారితో ఏం మాట్లాడింది అనే విషయం కూడా తెలిసిపోతుందట. ఈ యాప్‌ను గురించి తెలుసుకున్న వేలాదిమంది దీన్ని చక్కగా గూగుల్‌నుండి డౌన్‌లోడ్ చేసేసుకుని తమకు ఎవరిపైన అనుమానం ఉందో వారిపై ఉపయోగించడం ప్రారంభించారు.
నిజానికి ఇలాంటి యాప్ వల్ల సద్వినియోగంకన్నా దుర్వినియోగమే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన గూగుల్, ప్లేస్టోర్‌నుండి దీన్ని తొలగించింది. దీంతో దీని తొలగింపు వివాదాస్పదమైంది. దీన్ని సృష్టించిన బ్రెజిల్‌కు చెందిన మాధ్యూస్ గ్రిజో ఈ విషయం గురించి మాట్లాడుతూ, గూగుల్ తాను సృష్టించిన యాప్‌ను తొలగించడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గూగుల్ తొలగించినా తన కంపెనీ వెబ్‌సైట్ నుండి ఈ యాప్ లభిస్తుందని చెబుతున్నాడు. దీన్ని ఒక్కసారి ఒకరి ఫోన్‌లో డౌన్‌లోడ్ చేస్తే ఇక వారు ఎక్కడికి వెళ్లారు, ఎవరితో మాట్లాడారు అనే విషయాలు తెలియడమే కాకుండా వారి ఫోన్‌కు వచ్చే మెసేజ్‌ల కాపీలు కూడా మూడో వ్యక్తికి చేరుతాయి. అవతలి వ్యక్తి ఫోన్‌కు కాల్‌చేసి వారికి తెలియకుండానే వారి ఫోన్‌ను సైలెంట్ మోడ్‌కు మార్చి, వారు కాల్ అటెండ్ అయ్యేలా చేసి అక్కడ వారు ఏం మాట్లాడుతున్నారో కూడా వినవచ్చట.