: 40 రూపాయల కోసం.. ఎమ్మెల్యే రాజీనామా
40 రూపాయల కోసం ఎమ్మెల్యే రాజీనామా ఏంటనుకుంటున్నారా? నిజమే 40 రూపాయల కోసం గొడవపడి పదవి మీదకి తెచ్చుకున్నాడు అనిల్ కదమ్ అనే శివసేన ఎమ్మెల్యే. నాసిక్ దగ్గర్లో అందరూ మహిళా సిబ్బంది ఉన్న ఒక టోల్ ప్లాజాను ప్రైవేటు వాహనంలో ఎమ్మెల్యే అనిల్ కదమ్ దాటుతుండగా రుసుము కట్టాలంటూ సిబ్బింది కారును ఆపారు. 'ఎమ్మెల్యేను... నన్నే రుసుము కట్టమంటారా?' అని మండిపడ్డారు. 'ఎవరైనా సరే రుసుము 40 రూపాయలు కట్టాల్సిందే' అంటూ సిబ్బంది చెప్పేసరికి అనిల్ కదమ్ కి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. దీంతో సిబ్బందిని నానా దుర్భాషలాడి, మహిళలని కూడా చూడకుండా గుడ్డలూడదీస్తానన్నాడు.
అక్కడితో ఆగకుండా టొల్ బూత్ పై తన ప్రతాపం చూపించాడు. అక్కడున్న కంప్యూటర్ ని ధ్వంసం చేసి వెళ్లిపోయాడు. సాధారణంగా ప్రజాప్రతినిధులకు టోల్ గేట్ లో మినహాయింపు ఉంటుంది. కానీ, ఆయన తన స్వంత కారులో కాకుండా ప్రైవేటు కారులో ప్రయాణిస్తూ నంబర్ నోట్ చేసుకోమన్నాడు. 'అది కుదరదు కట్టాల్సిందే'ననడంతో ఈ గొడవ జరిగింది. జరిగిన తంతంతా సీసీ కెమెరాలో రికార్డై పత్రికలకు ఎక్కడంతో రాజీనామా బాటపట్టక తప్పలేదు.