: అయోధ్యలో భారీ భద్రత.. కొనసాగుతున్న అరెస్టుల పర్వం
కోసి పరిక్రమ యాత్రను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేటి నుంచి సెప్టెంబర్ 13 వరకూ నిర్వహిస్తోంది. ఈ యాత్రకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా, యాత్ర చేసి తీరుతామని వీహెచ్ పీ ప్రకటించింది. ఈ ఉదయం యాత్ర ప్రారంభం కాగానే పోలీసులు వీహెచ్ పీ నేతలను అరెస్ట్ చేశారు. కొద్ది సేపటి క్రితమే వీహెచ్ పీ నేత ప్రవీణ్ భాయ్ తొగాడియాను, మహంత దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయమే స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర యాదవ్, వీహెచ్ పీ నేత రామ్ విలాస్ వేదాంతిని అరెస్ట్ చేశారు. శనివారం రాత్రే 350 మంది వరకూ వీహెచ్ పీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
'యాత్రకు అనుమతించేది లేదు'... ఇది ఉత్తరప్రదేశ్ సర్కారు మాట. 'యాత్ర నిర్వహించి తీరుతాం'... ఇది వీహెచ్ పీ నేతల సంకల్పం. దీంతో పరిస్థితి దేనికి దారితీస్తుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. మొత్తానికి ఇదో రాజకీయ అంశంగా మారిపోయింది. ఏదైనా హింస జరిగితే అందుకు ఉత్తరప్రదేశ్ సర్కారుదే బాధ్యతని వీహెచ్ పీ హెచ్చరించింది. ఈ యాత్రపై ఉత్తరప్రదేశ్ సర్కారు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. నిషేధం సబబేనని పేర్కొంది. మరోవైపు యాత్ర నేపథ్యంలో అయోధ్యతోపాటు ఫైజాబాద్ జిల్లా అంతటా భారీగా పోలీసులను నియమించారు. సుమారు 8,000 పోలీసులు, పారామిలటరీ దళాలు రంగంలోకి దిగాయి. చుట్టుపక్కల జిల్లాలలో 144 సెక్షన్ విధించారు.