: మనలో 'మనం' అనే భావన ఎక్కువట
భూమిపై నివసించే వివిధరకాల జీవుల్లో మనిషిని అత్యున్నతుడుగా చెప్పవచ్చు. ఆలోచనా శక్తి, నేర్పు, నైపుణ్యం వంటి పలు విషయాలతో పోల్చుకుంటే మనిషి ఇతర జీవులకన్నా కూడా అధికుడుగా చెప్పవచ్చు. అలాగే మనుషుల్లో మనం అనే భావన ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే మనుషులకు ఇతరులతో స్నేహాన్ని కొనసాగించే అలవాటు ఎక్కువగా ఉంటుందని, స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారని శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.
వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో మనిషి స్వతహాగా తనకు ఇష్టులైన వ్యక్తులతో విపరీతమైన సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని పెంచుకునే లక్షణం ఉంటుందని, అందుకే కొన్నాళ్ల సాన్నిహిత్యం తర్వాత కొత్తవారు కూడా మన జీవితాలతో పెనవేసుకుపోతారని ప్రొఫెసర్ జేమ్స్ కోన్ చెబుతున్నారు. మనిషి మెదడులో ఆప్యాయతానురాగాలు, సానుభూతి, స్నేహం వంటి లక్షణాలు చాలా ధృడంగా ఉంటాయని, ఇలాంటి భావాలు మనిషి మస్తిష్కంలో పెనవేసుకుని ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు తాము ఎంపిక చేసుకున్న కొందరు వ్యక్తుల మెదడు స్పందనలను ఎంఆర్‌ఐ ద్వారా గుర్తించి విశ్లేషించినట్టు తెలిపారు. తమతో చేరికగా ఉండే వ్యక్తులతో ఏ విధమైన అనుబంధాన్ని పెంచుకుంటారనే విషయం ఈ విశ్లేషణ స్పష్టం చేసిందని కోన్ తెలిపారు. ఈ కారణాలవల్లనే మనుషుల్లో 'మనం' అనే భావన చాలా బలీయంగా ఉంటుందని, ఒక వ్యక్తి అస్థిత్వం అనేది ఎక్కువగా ఇతరులతో వారికున్న అనుబంధాన్ని కచ్చితంగా ప్రతిఫలిస్తుందని కోన్ చెబుతున్నారు.