: చిరంజీవి పదవీ వ్యామోహంతో మాట్లాడుతున్నాడు: ఎంపీ శివప్రసాద్
కేంద్ర మంత్రి చిరంజీవి పదవీవ్యామోహంతోనే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటున్నాడని టీడీపీ ఎంపీ శివప్రసాద్ స్పష్టం చేశారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న శివప్రసాద్ కు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు భారీ స్వాగతం పలికారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చిరంజీవికి సమైక్యాంధ్ర మీద చిత్తశుద్ధిలేదన్నారు. సోనియా ఇంటికి బయలు దేరిన దగ్గర్నుంచి, సెక్యూరిటీ ఆపిన సమయాన్ని కూడా లెక్కించిన చిరంజీవి సోనియాతో 45 నిమిషాలు సమావేశమయ్యానని తళుకుబెళుకు మాటలు చెబుతున్నాడని విమర్శించారు.
సోనియా ఎవరితో ఎంత సేపు మాట్లాడుతుందో ఎంపీలమైన తమకు తెలుసని ఆయన అన్నారు. ఆ రకంగా అయితే తానే సోనియా గాంధీతో ఎక్కువగా నాలుగు సార్లు మాట్లాడానని ఆయన తెలిపారు. కేవలం యూటీ చేస్తే సీమాంధ్రులు ఏమంటారనే విషయం తెలుసుకోవడానికే ఆయన హైదరాబాద్ పై యూటీ ప్రస్తావన తెస్తున్నారని విమర్శించారు. కేవలం పదవీ వ్యామోహంతోనే చిరంజీవి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని శివప్రసాద్ మండిపడ్డారు.