: జాడ లేని 92 స్మారక కట్టడాలు
చార్మినార్, గోల్కొండ కోట చూడగానే నిజాం పాలకుల చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. తాజ్ మహల్ చూస్తే షాజహాన్ అనంత ప్రేమపై, ప్రేమతో కూడిన అసూయ కలుగుతుంది. చరిత్రకు, చారిత్రక విశేషాలకు ఇవి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇలాంటివే దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాధాన్యంగల 92 కట్టడాల ఆచూకీ తెలియడం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెల్లడించడం విస్మయానికి గురి చేస్తోంది. కాగ్ భారత పురావస్తు సర్వే విభాగం పరిరక్షణలో ఉన్న వాటిని ఆడిట్ చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
3,678 చారిత్రక కట్టడాలు, స్థలాలకు గాను కాగ్ 1,655(45శాతం) కట్టడాలనే పరిశీలించింది. అన్నింటినీ పరిశీలిస్తే జాడలేని వాటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే, ఇలా కనుమరుగైన వాటిని భారత పురావస్తు సర్వే విభాగం కప్పిపుచ్చుతోంది. 2006, 2012లో పార్లమెంటుకు సమర్పించిన పత్రాలలో కేవలం 35 స్మారకాలే కనిపించడం లేదని తప్పుడు వివరాలు ఇచ్చినట్లు కాగ్ నిగ్గు తేల్చింది. అసలు తన పరిరక్షణలో ఉన్న చారిత్రక కట్టడాలు, స్థలాల సంఖ్యపై పురావస్తు సర్వే విభాగం వద్ద కచ్చితమైన సమాచారం కూడా లేదట. అంతేకాదు, తమ ఆధీనంలో ఉన్న స్మారకాలు ఎక్కడ ఉన్నదీ సంస్థ ఉద్యోగులు గుర్తించలేని పరిస్థితి ఉందని కాగ్ ఎండకట్టింది. ఇదీ మన అధికారులు, పాలకుల తీరు.