: రసాభాసగా విద్యుత్ ఛార్జీలపై విచారణ
విద్యుత్ ఛార్జీలపై హైదరాబాదు ఫ్యాప్సీ భవన్లో ఈఆర్ సీ చేపట్టిన బహిరంగ విచారణ రసాభాస అయింది. ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు, పలు ప్రజా సంఘాలు విచారణ వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించాయి. ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు అన్యాయమని వారు నినాదాలు చేశారు. ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు.
అటువైపు ఫ్యాప్సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళన నిర్వహిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ.. ఇదొక బూటకపు విచారణ అని విమర్శించారు. కొన్ని గ్యాస్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకే సర్కారు విద్యుత్ ఛార్జీలను పెంచాలని చూస్తోందని ఆరోపించారు.
ఒక్క రూపాయి ఛార్జీ పెంచినా ఊరుకునేది లేదన్నారు. మరోవైపు, ఈఆర్ సీ విచారణ వద్ద టీడీపీ, టీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఛార్జీలు పెంచుతూ ఎందుకు ప్రతిపాదనలు చేశారో చెప్పాలని అధికారులను నిలదీశారు.