: మరో చిరుతను మట్టుపెట్టిన హైదరాబాదీ వేటగాడు
హైదరాబాదీ వేటగాడు మరో చిరుతను మట్టుపెట్టాడు. కంగారేం లేదు లెండి..! ఇది పోలీసు కేసు అయ్యే వ్యవహారం ఎంతమాత్రమూ కాదు. నరభక్షణకు అలవాటు పడిన చిరుతను సంహరించాల్సిందిగా ప్రభుత్వ కోరిక మేరకు రంగంలోకి దిగిన హైదరాబాదీ వేటగాడు చిరుతను సంహరించాడు. గతంలో ఇలాంటి మనుషుల్ని తినడానికి అలవాటు పడిన చిరుతను సంహరించిన వివాదం ఇంకా పూర్తిగా చల్లారక ముందే వేటగాడు షఫాత్ ఆలీఖాన్.. మరో చిరుతను మట్టుపెట్టడం విశేషం. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అటవీ మరియు వన్యప్రాణి శాఖ వారి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఖాన్.. బుధవారం మండి ప్రాంతంలో ఆ చిరుతను చంపాడు.
మనుషుల్ని తినే చిరుతల పాదముద్రలను హిమాచల్ అధికారులు గుర్తించారు. రెండు మగ చిరుతలు సంచరిస్తున్నట్లుగా వారు గుర్తించి ఖాన్ను పురమాయించారు. తాను ఈనెల 11 వ తేదీన వాటిలో పెద్ద చిరుతను కనుగొన్నానని, అది తనపై దాడిచేయడంతో కాల్చేశానని ఖాన్ చెప్పాడు. ఆ సందర్భంలో ఓ స్వచ్ఛంద సంస్థ.. ఖాన్ తొలుత చంపిన చిరుత మనుషుల్ని తినేది కాదంటూ రభస చేసింది. ఈ విషయం ధ్రువీకరించడానికి దాని నమూనాలను డీఎన్ఏ పరీక్షలకు కూడా పంపారు. రెండో చిరుతను కూడా చంపడానికి ఖాన్కు 19వ తేదీన హిమాచల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ పనిని కూడా ఆయన పూర్తిచేశారు. స్వచ్ఛంద సంస్థ ఆందోళనలో అర్థం లేదని.. తను చంపినది మనుషుల్ని తినే చిరుతలనేనని ఖాన్ చెబుతున్నారు.