: ఇక కాఫీ తాగాల్సిన పనిలేదు
బాగా అలసటగా ఉన్నప్పుడు చక్కటి ఒక కాఫీ పడితే అప్పుడు పనిలో మళ్లీ హుషారు పుంజుకుంటుంది. అయితే కాఫీలు ఎక్కువగా తాగితే ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముందని ఒకవైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొందరు తమకు కాఫీ తాగాలని ఉన్నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాఫీని దూరంగా ఉంచుతున్నారు. ఇలాంటి వారికోసం ఈ వార్త. మీరు కాఫీ తాగకుండానే మీరు కాఫీ తాగిన అనుభూతిని కలిగించే ఒక చక్కటి స్ప్రేని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ స్ప్రేతో మీరు కాఫీ తాగాల్సిన అవసరం లేదు... కానీ కాఫీ తాగిన చక్కటి అనుభూతిని మీకు కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం స్ప్రేని తయారు చేశారు. ఈ స్ప్రేని మీరు మెడపైన, ముంజేతిపైన చల్లుకుంటే చాలు... మీకు చక్కటి కాఫీ తాగిన అనుభూతిని, సంతృప్తిని కలిగిస్తుందని చెబుతున్నారు. నీరు, కెఫీన్, ఓ అమినోయాసిడ్ మిశ్రమంతో కూడిన ఈ స్ప్రే చర్మంపై పడగానే ఇట్టే చర్మంలో ఇంకిపోతుంది. అంటే కాఫీ తాగాలనే మీ కోరికను ఇది సంతృప్తిపరుస్తుంది. దీంతో పరిమితికన్నా ఎక్కువగా కాఫీ తాగాలని ఉన్నా తాగలేనివారు, ఎంచక్కా దీన్ని చల్లుకుంటే కాఫీ తాగిన అనుభూతి కలుగుతుంది, అటు మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లు అవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి కప్పులకొద్దీ కాఫీ తాగాల్సిన అవసరం లేకుండా అలాంటి అనుభూతిని స్ప్రేతో సొంతం చేసుకోండిమరి.