: భారత మెడలో మరో ఉపగ్రహ హారం


మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం వేదిక కాబోతుంది. ఏడు ఉపగ్రహాలను తీసుకుని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్ఎల్వీ సీ20 రాకెట్ రోదసి వైపు ప్రయాణించనుంది. ఇందుకు ముహూర్తం సాయంత్రం 5.56 నిమిషాలు.

పీఎస్ఎస్ఎల్వీ రాకెట్ తీసుకుపోనున్న ఏడు ఉపగ్రహాలలో ప్రధానమైనది సరళ్. దీని బరువు 409 కేజీలు. ఇది మనదేశానికి చెందినది. మిగతా ఆరు విదేశాలకు చెందిన చాలా చిన్న ఉపగ్రహాలు. సరళ్ ఉపగ్రహం వల్ల వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితంగా అంచనా వేయడంలో భారత సత్తా ఇనుమడిస్తుంది. సాగరాలను అమూలాగ్రం పరిశీలిస్తూ తగిన మార్పుల సమాచారాన్ని అందిస్తుంది.

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, సాగర గర్భంలో తలెత్తే మార్పులు, జలచరాలు, ఇలా సముద్రాలకు సంబంధించి ఎన్నో రకాల వివరాలు అందించనుంది. ఫలితంగా మార్పులను ముందే పసిగట్టి విపత్తుల ముప్పును తగ్గించుకునే అవకాశం కలుగుతుంది. ఇళా ఐదేళ్ల పాటు సరళ్ తన సేవలను అందిస్తుంది. దీనికి కావాల్సిన పేలోడ్ ను ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ పీఎన్ఈఎస్ అందిస్తోంది.

కెనడాకు చెందిన సఫైర్, నియోస్ శాట్ ఉపగ్రహాలు, ఆస్ర్టియాకు చెందిన బ్రైట్, యూనిబ్రైట్ ఉపగ్రహాలు, డెన్మార్క్ కు చెందిన ఆసాట్3,  బ్రిటన్ కు చెందిన స్ర్టాండ్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెడుతుంది. దాంతో అవి రోదసిలో పరిభ్రమిస్తూ పలు రకాల సమాచారాలను భూ కేంద్రాలకు అందిస్తాయి. ఇవన్నీ చిన్న, సూక్ష్మ ఉపగ్రహాలు.
 
పీఎస్ఎల్వీ రాకెట్లకు ఘన చరిత్రే ఉంది. ఇప్పటికే ఎన్నో విజయాలను ఈ రాకెట్లు అందించాయి. అందులోనూ మన రాష్ట్రంలోని శ్రీహరి కోట కేంద్రంగా జరిగిన పరీక్షలే ఎక్కువగా ఉన్నాయి. ఇస్రో విజయాలలో పీఎస్ఎల్వీ రాకెట్లకు ఎంత ప్రాముఖ్యం ఉందో, శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రానికి అంతకంటే ఎక్కువే ప్రాధాన్యం ఉంది. విశేషం ఏమిటంటే ఇది ఇస్రోకు 101వ ప్రయోగం కావడం. 

  • Loading...

More Telugu News