: సినీ ఫక్కీలో దొంగతనం
విజయవాడలో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. సాధారణంగా ఆదాయపుపన్ను అధికారులమనో, లేక పోలీసులమనో ఇళ్లు దోచుకునే ఘటనలు చాలా చూస్తుంటాం. కానీ శుభలేఖలు ఇవ్వడానికొచ్చామని చెప్పి ఇళ్లు దోచుకున్న ఘటన బెజవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే విజయవాడ పటమటలంకలోని వెంకట్ హైట్స్ అపార్ట్ మెంట్ లో కాంట్రాక్టర్ వేములపల్లి శ్రీహరి కుటుంబం నివాసముంటోంది. ఆయన పనులపై బయటికెళ్లగా, పనిమనిషి కోసం ఆయన భార్య ఎదురు చూస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు శుభలేఖలు ఇచ్చేందుకు వచ్చామని వాచ్ మన్ కు చెప్పారు.
వాచ్ మన్ ఆపడంతో వారిలో ఒకరు శ్రీహరికి ఫోన్ చేస్తున్నట్టు నటించి, 'అంకుల్ నేను ఆంజనేయులుగారి అబ్బాయిని, వెడ్డింగ్ కార్డు ఇచ్చేందుకు వచ్చాను' అన్నాడు. దాంతో, వాచ్ మన్ వారిని బంధువులుగా నమ్మి లోపలికి అనుమతించాడు. దీంతో వాళ్లు ఫ్లాట్ కి వెళ్లి పెళ్లి కార్డు పద్మజకు ఇచ్చారు. అనంతరం మళ్లీ ఫోన్ చేస్తున్నట్టు నటించి, 'అంకుల్ ఇక్కడ మరి కొంతమందికి కార్డులు ఇవ్వమన్నారు. కానీ వారి అడ్రస్ లు తెలియడం లేదు' అని ఆమెను నమ్మించి కార్డులు కారులో ఉన్నాయని వెళ్లి తెచ్చి ఆమెకు ఇచ్చారు. మంచినీళ్లు కావాలని, ఇవ్వమని అడిగి ఆమెపై దాడికి దిగారు.
రివాల్వర్ తో బెదిరించి ఆమె నోటికి ప్లాస్టర్ వేసి బెడ్ రూం బీరువాలో ఉన్న రెండు బంగారు గాజులు, ఉంగరం, రెండు చెవి దుద్దులు తీసుకున్నారు. తరువాత మరో బెడ్రూంలో ఉన్న బీరువాను పరిశీలించి ఏమీ దొరకకపోవడంతో, దొరికిన ఆరు కాసుల బంగారంతో ఉడాయించారు. ఆమె నోటికి ప్లాస్టర్ వేసి, తమ చేతి గుర్తులు పడకుండా గ్లోవ్స్ ధరించి జాగ్రత్త పడ్డారు. అపార్ట్ మెంట్లలో సీసీ కెమెరాలు ఆందుకే అమర్చాలని హెచ్చరిస్తామని పోలీసులు తెలిపారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ రకమైన దొంగతనాలకు పాల్పడే పాత నేరస్థుల ఫోటోలు చూపించి నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.