: ఎయిడ్స్ రోగుల వివరాలు బయటపెట్టకండి: గుజరాత్ హైకోర్టు


ఎయిడ్స్ రోగుల మానసిక వేదన కోణాన్ని అర్థం చేసుకున్న గుజరాత్ హైకోర్టు వైద్యులకు కనువిప్పు కలిగించే తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స తీసుకుంటున్న ఎయిడ్స్ రోగుల వివరాలు బయటకు వెల్లడించవద్దని జస్టిస్ భాస్కర్ భట్టాచార్య, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అప్పుడే మిగతా రోగులు కూడా ధైర్యంగా చికిత్స తీసుకోవడానికి ముందుకు వస్తారని పేర్కొంది.

2009 జూన్ లో జామ్ నగర్లోని గురుగోబింద్ సింగ్ ప్రభుత్వాస్పత్రిలో ఒక అరుదైన సంఘటన జరిగింది. ఒక నర్సు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న మహిళ నుదుటిపై ఈమె ఎయిడ్స్ రోగి అంటూ స్టిక్కర్ అంటించింది. దీనిపై జామ్ నగర్ వాసి హర్షద్ పర్బరి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఎయిడ్స్ రోగుల వివరాలు బయటపెట్టకుండా చూడాలని కోరారు. రోగుల పట్ల అమానవీయంగా ప్రవర్తించే డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని తొలగించాలని కోరారు.

ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం.. 30 శాతం నిరక్షరాస్యులున్న దేశంలో అలా వివరాలు బయటపెడితే రోగులు కుటుంబం నుంచి, సమాజం నుంచి తిరస్కరణకు, హింసకు గురయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనివల్ల వారు నివాసం, ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంటూ వివరాలు బయటకు వెల్లడించరాదని ఆదేశించింది.

  • Loading...

More Telugu News