: చేపలతో మేలెంతో
చేపలు మనకు చాలా మేలు చేస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో చేపలు ఎంతో ప్రాధాన్యతను కలిగివున్నాయి. వారానికి కనీసం రెండుసార్లు చేపలతో చేసిన పదార్ధాలను తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉండవని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.
స్వీడన్‌కు చెందిన నిపుణులు సుమారు రెండువేల మందిపై చేసిన అధ్యయనంలో వారానికి రెండుసార్లు చేపలను, చేపలతో చేసిన పదార్ధాలను తినడం వల్ల భవిష్యత్తులో ఆర్థ్రరైటిస్ సమస్య రాదని తేలింది. చేపలు తినేవారికి కీళ్లు, కండరాల సమస్యలు తక్కువగా ఉంటాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా తెల్లగా ఉండే కొన్ని రకాల చేపల్లో నూనె ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి చేపల్లో ఒమెగా త్రీ ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా నూనె ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల కడుపులో మంట, అజీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి.
చేపల్లో విటమిన్ 'ఎ', 'డి' ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఎముకలకు ఎంతో బలాన్నిస్తాయి. దీర్ఘకాలం పాటు మనల్ని వేధిస్తున్న ఎముకలకు సంబంధించిన సమస్యలను మనం ఆహారంతో తీసుకునే చేపలు దూరం చేస్తాయి. అంతేకాదు వయసు పెరిగేకొద్దీ ఎముకలు గుల్లబారకుండా ఉండేందుకు కూడా చేపలు దోహదం చేస్తాయట. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కూడా చేపలను తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.