: ఈ కెమెరా సూపర్
చీకట్లో ఫోటోలు తీయాలంటే మంచి లైటింగ్ కావాలి. అయితే ఈ కెమెరా మాత్రం చాలా ప్రత్యేకమైంది. దీంతో ఎంచక్కా చీకటిలో సైతం స్పష్టమైన ఫోటోలను తీయవచ్చు. ఈ కొత్తరకం కెమెరాతో రాత్రిపూట కూడా ఆకాశాన్ని స్పష్టంగా ఫోటో తీయవచ్చు. ఎంత స్పష్టంగా అంటే చందమామను కూడా స్పష్టంగా చిత్రించేలా ఫోటోను తీయవచ్చట. అలాంటి కొత్త కెమెరాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అరిజోనా విశ్వవిద్యాలయం, కార్నెగీ అబ్జర్వేటరీ, ఇటలీలోని ఆర్సెట్రి అబ్జర్వేటరీలు కలిసి ఒక కొత్తరకం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాయి. ఈ పరిజ్ఞానంతో రూపొందించిన కెమెరాతో రాత్రిపూట కూడా ఆకాశాన్ని అంతచీకటిలో స్పష్టంగా చిత్రించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహజంగా రాత్రిపూట కెమెరాతో ఫోటోలను తీస్తే చీకటిలో అస్పష్టంగా కనిపించే నక్షత్రాలను మనం ఫోటోలో చూడగలం. అయితే చందమామపై ఒక బేస్‌బాల్ మైదానమంత ప్రాంతం కూడా అత్యంత స్పష్టంగా కనిపించేలా ఈ కెమెరాతో ఫోటోలను చిత్రీకరించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ కొత్తరకం కెమెరా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందని, ఇది వాతావరణంలోని అవరోధాలను కూడా చీల్చుకుంటూ అద్భుతమైన చిత్రాలను చిత్రిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంకోసం శాస్త్రవేత్తలు సుమారు ఇరవై ఏళ్లపాటు శ్రమించారు.
ఈ క్రమంలో వారు రూపొందించిన కెమెరాను చిలీలోని ఎడారిలో ఉన్న మాగెలాన్ 6.5 మీటర్ టెలిస్కోపు వద్ద మోహరించారు. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ లెయిర్డ్ క్లోజ్ మాట్లాడుతూ ఈ కొత్తరకం కెమెరా రాత్రివేళల్లో ఆకాశాన్ని ఇంతకుముందు ఎన్నడూలేనంత స్థాయిలో స్పష్టమైన ఫోటోలను తీయడం మమ్మల్ని ఉద్వేగంలో ముంచెత్తుతోంది అంటున్నారు. సాధారణంగా భూమిపై ఉన్న టెలిస్కోపులకు వాతావరణ సంబంధ అవరోధాలు బాగా ఇబ్బందిపెడతాయి. ఫలితంగా అస్పష్టమైన చిత్రాలు వస్తాయి. దీన్ని అధిగమించడానికి శాస్త్రవేత్తలు చాలా శక్తివంతమైన అడాప్టిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇందులో అంగుళంలో 16వ వంతు ఉండే పలుచని, ఒంపు తిరిగిన గాజు అద్దాన్ని టెలిస్కోపు ప్రధాన అద్దంపై అమర్చారు. దీన్ని అడాప్టిక్ సెకండరీ అద్దంగా పేర్కొన్నారు. ఇది వాతావరణ ప్రభావాలను ఎదుర్కొనడానికి సెకనుకు వెయ్యిసార్లు తన ఆకృతిని మార్చుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.