: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి... ఇదీ కాంగ్రెస్ పరిస్థితి!


సొంత పార్టీ సభ్యులనే లోక్ సభ సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని అధికార కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగించింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు టీడీపీ ఎంపీలు, కాంగ్రెస్ కు చెందిన ఏడుగురు ఎంపీలను ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీర్మానాన్ని ప్రతిపాదించింది. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు తమ స్థానాల్లో నిలబడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు మాత్రమే చేశారు. టీడీపీ ఎంపీలు వలే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేయలేదు. అయినా, వారిని కూడా సస్పెండ్ చేయాలనుకోవడం వెనుక ప్రభుత్వం ఎంత ఆగ్రహంగా ఉందో వ్యక్తమవుతోంది.

ఈ నెల 5 నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరుగుతున్నాయి. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో దాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం అందిపుచ్చుకుంది. తొలి రోజు నుంచే సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎంపీలు తమ ప్రాంతానికి న్యాయం చేయాలనే డిమాండ్ తో ఆందోళన చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు. ఈ ఆందోళనల వల్ల సభా సమయం వృధా అయిపోతుండడంతో మొదట్లోనే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, కీలకమైన ఆహార భధ్రత బిల్లుకు ప్రతిపక్షాల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ దేనికి దారితీస్తుందో అని ప్రభుత్వం ఓపిక పడుతూ వచ్చింది. కానీ, చివరికి కీలకమైన బిల్లులుపై చర్చకు కూడా అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం కఠిన చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ చర్యను ఎన్సీపీ మినహా అన్ని పార్టీలు తప్పుబట్టాయి. సభ వాయిదా పడింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ విషయంలో టీడీపీ సహా ప్రతిపక్షాలను శాంతింపజేసేందుకు రాయబారాలు ప్రారంభించింది

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కులే వచ్చినట్లు ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే, సొంత పార్టీ నేతలు సైతం తెగించి ముందుకు వస్తుండడం కాంగ్రెస్ కు మింగుడు పడని విషయం. సస్పెన్షన్ తీర్మానం కారణంగా సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఇంకా కఠినంగా ఉద్యమించడానికి అధిష్ఠానమే అవకాశం ఇచ్చినట్లు అయింది. ఒక పక్క సీమాంధ్రలో మిన్నంటిన ఉద్యమం, పార్టీపై తీవ్ర ఒత్తిడులు మరోవైపు ఓట్లు కురిపిస్తాయనుకున్న కీలక బిల్లులకు ప్రతిపక్షాల సహాయ నిరాకరణ, ఇంకోవైపు వికటించిన ఆర్థిక చర్యలపై ప్రతిపక్షాల నిలదీతలు, శ్రీలంకకు ప్రధాని వెళ్లడాన్ని నిరసిస్తూ డీఎంకే సభ్యుల ఆందోళన, ఇలా దిక్కుతోచని స్థితిని ప్రస్తుతం కేంద్రంలో అధికార కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా తయారైంది.

  • Loading...

More Telugu News