: భారత్ నిర్ణయంతో యూఏఈ వ్యాపారుల గగ్గోలు
అడ్డగోలు దిగుమతులను నివారించే చర్యల్లో భాగంగా విదేశాల నుంచి తెచ్చుకునే ఫ్లాట్ టీవీలపై కేంద్రం పన్ను విధించడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ చర్య వల్ల టీవీల అమ్మకాలు పడిపోతాయని ఆందోళన చెందుతున్నారు. అక్కడ అమ్ముడుపోతున్న వాటిలో 20 శాతం టీవీలు భారతీయులు కొనేవే మరి. అక్కడ ప్రతీ నెలా 85 వేలకు పైనే టీవీలు అమ్మడవుతుంటాయి. వాటిలో అక్కడ స్థిరపడిన భారతీయులు, భారత్ నుంచి సందర్శనకు వచ్చిన వారు 20 వేల వరకు కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ నెల 26 తర్వాత విదేశాల నుంచి ఫ్లాట్ టీవీలను తెచ్చుకునే విమాన ప్రయాణికులు 35 శాతం దిగుమతి సుంకం కట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంత పన్ను అంటే టీవీలను తెచ్చుకోవడం మానేస్తారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కూడా అదే. కానీ, దీనివల్ల విక్రయాలు తగ్గితే తమ లాభాలపై ప్రభావం పడుతుందని యూఏఈ వ్యాపారుల ఘోష.