: లోక్ సభను కుదిపేసిన రాష్ట్ర విభజన.. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ తీర్మానం
రాష్ట్ర విభజన అంశం లోక్ సభను కుదిపేసింది. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు నిరసనలు వ్యక్తం చేయడంతో పదకొండు మంది ఎంపీల సస్పెన్షన్ కు తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందులో నలుగురు టీడీపీ, ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, తీర్మానాన్ని మిగతా పార్టీల సభ్యులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. సభ్యుల సస్పెన్షన్ సరికాదంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్ర సభ్యులు వెల్ లోకి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో స్పీకర్ తీర్మానానికి ఓటింగ్ జరిపేందుకు సిద్ధమయ్యారు. వెంటనే పోడియం వద్దకు వెళ్లిన సభ్యులు మైక్ లు లాగేశారు. దాంతో, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో స్పీకర్ సభను మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు వాయిదా వేశారు. అటు సభ్యుల సస్పెన్షన్ ను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.
కాంగ్రెస్ సభ్యులు సాయి ప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట శ్రీనివాస రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు .. టీడీపీ సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ల సత్యానారాయణ, నిమ్మల కిష్టప్ప, శివ ప్రసాద్ లను సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ ప్రతిపాదించింది.