: ఆడాళ్లకు నరకమే.. అమెరికన్ విద్యార్థి మనోగతం
భారత దేశం పర్యాటకులకు, సాహసికులకు స్వర్గధామమే కానీ మహిళలకు మాత్రం నరకమని ఓ అమెరికన్ విద్యార్ధిని చెబుతోంది. మైఖెలా క్రిస్ అనే చికాగో యూనివర్సిటీకి చెందిన విద్యార్ధిని సిఎన్ఎన్ఐబీఎన్ రిపోర్ట్ లో భారత పర్యటనలో తనకు ఎదురైన అనుభవాలను తెలిపింది. భారత్ లో అడుగడుగునా వేధింపులు, ఎక్కడపడితే అక్కడ తడమడాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. తాను ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా నడిరోడ్డు మీదే తాను వెక్కివెక్కి ఏడ్వాల్సి వచ్చిందని చెప్పింది.
'ఇండియా ద స్టోరీ యు నెవర్ వాంటెడ్ టు హియర్' అనే పేరుతో ఆమె తన వేదన వెళ్లగక్కింది. దక్షిణ ఆసియా వ్యవహారాల పరిశోధన కోసం వచ్చిన ఆమె నిర్భయ ఘటనకు కొద్ది రోజుల ముందే భారత్ ను వీడి తన స్వస్థలానికి వెళ్లిపోయింది. ఆమె వెల్లడించిన కథనం అంతర్జాతీయంగా సంచలనం రేకిత్తిస్తోంది. బుధవారం ఉదయానికే ఈ కథనాన్ని 8 లక్షల మంది వీక్షించినట్టు సమాచారం. తనకు, తన సహచరికి ఎదురైన అనుభవాలపై దిగ్భ్రాంతి చెందిన ఆమె, తనపై 48 గంటల్లో రెండుసార్లు అత్యాచార యత్నం జరిగిందని తెలిపింది. భారత దేశం గొప్పదే. మనసును ఆహ్లాదపరిచే ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవం, కళలు అన్నీ అద్భుతమే కానీ, అక్కడ మహిళల దుస్థితి వర్ణనాతీతమని తెలిపింది.
ఈ సందర్భంగా జరిగిన చిన్న అనుభవాలను వివరించింది. పూణేలో గణేష్ ఉత్సవాల్లో డాన్సులు చేశారని, అంతలోనే మగాళ్లంతా తమను వీడియో తీసేందుకు ఎగబడ్డారని అన్నారు. చీరలు చౌకగా దొరుకుతాయని, కానీ అవి కొనడానికి వెళ్లినప్పుడు, చెప్పులు కొన్నప్పుడు షాప్ కీపర్ తో సహా అందరూ ఎక్కడెక్కడో తాకుతూనే ఉన్నారని తెలిపింది. అయితే భారత దేశం పర్యాటకులకు స్వర్గధామమే కానీ మహిళలకు మాత్రం ప్రత్యక్షనరకమని స్పష్టం చేసింది. తన జీవితంలో ఊహించలేనన్ని సాహసాలు చేయగలిగానని మైఖెలా క్రిస్ తెలిపింది.