: పిల్లికి ప్రాణదానం చేసిన కుక్క!
అనగనగా ఒక పిల్లి... అది అలా అలా తిరుగుతూ చటుక్కున ఒక ఎలుకను తినేసింది. అయితే అది విషపూరితమైంది. దీంతో పిల్లి ప్రాణాపాయంలో పడింది. దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళితే రక్తం మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పారు. చివరికి ఒక కుక్క రక్తాన్ని పిల్లికి ఎక్కించడంతో చిత్రంగా ఆ పిల్లి బ్రతికి బయపడింది. ఏంటి ఇదంతా చందమామ కథ అనుకుంటున్నారా... అదేంకాదు. నిజంగానే జరిగింది. ఒక పిల్లి ప్రాణాపాయంలో ఉంటే కుక్క రక్తాన్ని ఎక్కించిన వైద్యులు ఆ పిల్లికి ప్రాణదానం చేశారు.
న్యూజిలాండ్‌లోని తారంగా నగరంలో పెంపుడు పిల్లి ఒక ఎలుకను తినేసింది. అయితే ఆ ఎలుక విషపూరితమైంది. దీంతో ఆ పిల్లి ప్రాణాపాయ పరిస్థితుల్లో పడింది. దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా వెంటనే పిల్లికి రక్తమార్పిడి చేయాలని, లేదంటే ప్రాణాలు పోవడం ఖాయమని వైద్యులు చెప్పారు. అయితే పిల్లి రక్తం గ్రూపు తెలుసుకోవడం అనేది చాలా సమయంతో కూడుకున్న పని. ఇటుచూస్తే పిల్లికి రక్తం ఎక్కించడానికి అంత సమయం లేదు. దీంతో చేసేది లేక వైద్యులు చివరి ప్రయత్నంగా ఒక లాబ్రాడార్ జాతికి చెందిన కుక్క రక్తాన్ని పిల్లికి ఎక్కించారు. వైద్యులు చేసిన ఈ అరుదైన ప్రయత్నం ఎంచక్కా విజయవంతమైంది. ఆ పిల్లి బతికిపోయింది. పిల్లి జాతికి జీవితకాల శత్రువైన కుక్క రక్తంతో ఆ పిల్లి తిరిగి ప్రాణం పోసుకుంది.