: చనిపోయినా మళ్లీ సృష్టించవచ్చు!
చనిపోయిన వ్యక్తులను మళ్లీ పుట్టించవచ్చా... ఏమో అలాంటి రూపంతో ఉన్న వ్యక్తులను మళ్లీ పుట్టించవచ్చేమో... ఎందుకంటే ఒకప్పుడు భూమిపై నివసించిన భారీ ఏనుగుల వంటి జంతువులను తిరిగి సృష్టించేందుకు ఇప్పడు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మరణించిన మనుషులకు సంబంధించిన డిఎన్‌ఏతో మళ్లీ అదే రూపంలో ఉన్న మనుషులను సృష్టించవచ్చు కదా? అనే ఉద్దేశంతో ఒక శాస్త్రవేత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. అది సాధ్యమైనప్పుడు ఇది కూడా సాధ్యమవుతుంది కదా అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కూడా.
కెనడాకి చెందిన దంతవైద్యుడు మైఖేల్ జుక్ ఒక దంతాన్ని వేలం పాటలో 2011లో భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నాడు. సదరు దంతం ఎవరిదంటే ఒకప్పుడు రాక్‌మ్యూజిక్ రారాజులుగా వెలుగొందిన బీటిల్స్ బృందంలోని ముఖ్య సభ్యుడు జాన్ లెనాన్‌ది. బీటిల్స్ బృందాన్ని స్థాపించిన వారిలో ముఖ్యుడైన లెనాన్ 40 ఏళ్ల వయసులోనే 1980 డిసెంబరు 8న హత్యకు గురయ్యాడు. ఇప్పుడు మైఖేల్ జుక్ తాను సేకరించిన ఈ దంతం ద్వారా లెనాన్ డిఎన్‌ఏను సేకరించి లెనాన్ జన్యుక్రమాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకూ భూమిపై ప్రాచీన కాలంలో జీవనాన్ని సాగించిన భారీ ఏనుగులకు చెందిన జన్యు క్రమాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదే పరిజ్ఞానాన్ని లెనాన్ విషయంలో కూడా ఉపయోగించాలని జుక్ భావించారు. ఇందుకోసం అమెరికా శాస్త్రవేత్తల సహాకారం కూడా తీసుకుంటున్నానని జుక్ చెబుతున్నారు. ఈ విషయం గురించి జుక్ మాట్లాడుతూ ఒకప్పుడు భూమిమీద సంచరించి తర్వాత కాలంలో అంతరించిపోయిన భారీ ఏనుగులను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా తిరిగి సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మానవ క్లోనింగ్ కూడా సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్టు జుక్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.