: ఇవి మన మంచి నేస్తాలు
మనిషి జీవితంలో చక్కగా ఉపయోగపడే నేస్తాలుగా శునకాలను చెప్పుకుంటారు. మనిషి మనిషిని మోసం చేయవచ్చు, కానీ శునకాలు మాత్రం జీవితాంతం విశ్వాసాన్ని కలిగివుంటాయి. అందుకే విశ్వాసానికి మారుపేరుగా శునకాలను చెప్పుకుంటారు. ఇప్పుడు షుగరు వ్యాధిగ్రస్థులకు కూడా కుక్కలే మంచి నేస్తాలుగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే చక్కగా శిక్షణ పొందిన శునకాలు మధుమేహ రోగుల రక్తంలో గ్లూకోజు స్థాయిలు పడిపోగానే వెంటనే అవి అరచి తక్షణం వారు వైద్య సహాయం పొందేలా చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కొన్ని శునకాలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. సుమారు 17 శునకాలను తీసుకుని వాటికి మధుమేహ రోగులకు రక్తంలో గ్లూకోజ్ మోతాదు పడిపోయే పరిస్థితులను ఎలా గుర్తించాలో చక్కగా శిక్షణనిచ్చారు. తమ యజమానికి రక్తంలో గ్లూకోజు స్థాయి పడిపోయేటప్పుడు ఒంటిపైన వచ్చే చెమట, శ్వాసలో తేడాలను గమనించడం ద్వారా శునకాలు అత్యవసర పరిస్థితులను పసిగట్టేలా వాటికి శిక్షణనిచ్చారు. శిక్షణ పూర్తయిన తర్వాత వాటిని పరీక్షించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. షుగరు వ్యాధి ఉన్నవారికి రక్తంలో గ్లూకోజు స్థాయి పడిపోతున్న సమయంలో వెంటనే వైద్య సహాయం అందించకపోతే అది ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితులను ముందుగానే పసిగట్టి హెచ్చరించే పలురకాలైన పరికరాలు తయారైనాకూడా వాటికి కొన్ని పరిమితులున్నాయి. దీంతో ఇలా కుక్కలకు చక్కగా శిక్షణనిచ్చి వాటిని ఎంచక్కా ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి శునకాలు షుగరు ఉన్న వారిలో పూర్తి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకముందే గ్లూకోజు మోతాదు తగ్గిపోతున్న ప్రారంభదశలోనే తమను హెచ్చరిస్తున్నాయని వాటిని ఉపయోగిస్తున్న యజమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.