: అందువల్లే బరువు పెరుగుతుంటారు
కొందరు విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇలా బరువు పెరిగేవారు విపరీతంగా ఆహారం తీసుకుంటూ ఉంటారట. ఫలితంగా బరువు పెరిగి స్థూలకాయులుగా తయారవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇలా విపరీతంగా తినడానికి కారణం తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. స్థూలకాయులు ఎక్కువగా ఆహారం తీసుకోవడానికి కారణం వారు ఎంత తిన్నా తిన్నట్టు తెలియకపోవడమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో బరువు పెరగడం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు స్థూలకాయులు ఎంత ఆహారం తీసుకున్నా కూడా వారు కడుపు నిండినట్టుగా భావించకపోవడానికి కారణం గురించి పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనల్లో ఇలా స్థూలకాయులు అధిక ఆహారం తీసుకోవడానికి కారణం ఆకలికి సంబంధించిన హార్మోన్లు విఫలం చెందడమేనని గుర్తించారు. గ్లూకాగాన్ అనే హార్మోన్లు టైప్1 మధుమేహం ఉన్న వారిలో ఆకలిని కూడా తగ్గించివేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా రక్తంలో షుగరు శాతం తగ్గిపోతున్నప్పుడు మన శరీరంలో నిల్వ ఉన్న గ్లూకోజును విడుదల చేయాలని క్లోమంలో రహస్యంగా ఉండే గ్లూకాగాన్ అనే హార్మోను సంకేతాలను ఇస్తుంది. అయితే ఈ తాజా పరిశోధనల ప్రకారం ఆహారం తీసుకున్నప్పుడు కడుపు నిండిపోయింది అనే భావన కలిగించడంలో కూడా ఈ హార్మోను కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్థూలకాయం ఉన్న వారిలో ఈ గ్లూకాగాన్ హార్మోను విఫలం కావడం వల్ల వారికి ఎంత తిన్నా తిన్నామనే భావన కలగదని, ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.