: దక్షిణ భారతంలో దాడులకు టెర్రరిస్టుల కుట్ర
పాకిస్థాన్ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. సరిహద్దుల్లో అన్ని ఉల్లంఘనలకు పాల్పడుతూ, ముష్కరుల చొరబాట్లకు అవకాశం కల్పిస్తూ పక్కా వ్యూహాన్ని అవలంభిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, పాక్ మరో మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. శ్రీలంక మీదుగా తీవ్రవాదులను భారత్ లోకి చేరవేస్తోంది. మహారాష్ట్ర పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే ఎనిమిది మంది పాక్ సాయుధ తీవ్రవాదులు దేశంలో చొరబడ్డారు. అందులో నలుగురు పంజాబీలు కాగా మిగిలిన నలుగురు కాశ్మీరీలు కానీ, పఠాన్ లు కానీ అయి ఉంటారని తెలిపారు.
వీరంతా జాఫ్నాకు దగ్గర్లో మియలాదుత్తురైలోనైనా లేదా తమిళనాడులో మధురైకు దగ్గర్లోనైనా తలదాచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. శ్రీలంక మత్స్యకారుల రూపంలో తీవ్రవాదులు చొరబాట్లకు యత్నిస్తున్నారని, ప్రధానంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వీరు చొరబడే అవకాశముందని నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. వీరి చొరబాట్లతో మరోసారి పాకిస్థాన్ 26/11వంటి దాడులకు తెగబడే అవకాశముందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.