: ఉల్లి లారీని ఎత్తుకెళ్లిన దొంగలు
నగలు, నగదు, వస్తువులు.. వీటన్నింటి కన్నా ఉల్లి బాగా గిట్టుబాటు అవుతుందనుకుంది ఓ దొంగల ముఠా. ప్లాన్ ప్రకారం రాజస్థాన్ లో డిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై షాపురా గ్రామం దగ్గర వాహనంలో కాపు కాచి ఉన్నారు ముగ్గురు దొంగలు. 40 టన్నుల ఉల్లిపాయలతో ఒక లారీ అటుగా వస్తోంది. స్టాప్ అన్నారు. లారీ చక్రాలకు బ్రేక్ పడింది. 'ఏంట్రా.. మా వాహనాన్ని ఢీకొడతావా.. కళ్లు కానీ తలకెక్కాయా.. కట్టు నష్ట పరిహారం' అంటూ దబాయించారు. డ్రైవర్, క్లీనర్ ఇక లాభం లేదనుకుని లారీ నుంచి కిందికి దిగారు. 'జస్ట్ వెయిట్' అన్నారు ముగ్గురు దొంగలు.. లారీ ఎక్కారు, గేర్ వేశారు జుమ్మంటూ దూసుకుపోయారు.
అప్పుడు కానీ డ్రైవర్ తేరుకోలేదు. ఇంకేముంది, ఫోన్లో హలో హలో అనుకుంటూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. లారీనైతే ఎత్తుకెళ్లారుగానీ వాటిని అమ్ముకోవడం వెంటనే అయ్యే పని కాదనుకున్నారు దొంగలు. అందుకేనేమో దాన్ని మరెక్కడో వదిలేసి పరారయ్యారు. పోలీసులు దొంగలెత్తుకెళ్లిన ట్రక్ ను మారుమూల ప్రాంతంలో గుర్తించారు. ఉల్లి కిలో 70కి చేరి ఎన్ని అఘాయిత్యాలు చేయిస్తోందో కదా.