: మనం ఎంతకాలం జీవిస్తామో తెలుసుకోవచ్చట!
మనిషి ఎంతకాలం పాటు జీవిస్తాడు? అనే విషయాన్ని తెలుసుకోవడం అసాధ్యం. ప్రాణం పోకడ అనేది ఇప్పటి వరకూ ఎవరూ తెలుసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఒక కొత్తరకం రక్త పరీక్ష ద్వారా మనిషి ఎంతకాలం జీవిస్తాడు? అనే విషయాన్ని ఇట్టే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనిషి జీవన కాలాన్ని తెలిపే ఒక కొత్తరకం రక్త పరీక్షను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ రక్తపరీక్ష ద్వారా శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పుల వేగాన్ని బట్టి సదరు వ్యక్తి ఎంతకాలం పాటు జీవిస్తాడు? అనే విషయాన్ని తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవుని క్రోమోజోముల చివరన ఉండే టెలీమోర్స్ అనే సూక్ష్మ నిర్మాణాల పొడవు ఆధారంగా శరీరంలో మార్పు ఎంత వేగంగా జరుగుతోంది అనే విషయాన్ని ఈ కొత్తరకం రక్తపరీక్ష అంచనా వేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కణవిభజన జరిగిన ప్రతిసారీ ఈ టెలీమోర్స్ పొడవు తగ్గిపోతుంటుంది. మనిషి ఆయుష్షు తగ్గడానికి రక్త కణాల్లో తక్కువ పొడవుగల టెలీమోర్స్ ఎక్కువగా ఉండడానికి మధ్య సంబంధం ఉన్నట్టు శాస్త్రవేత్తలు జంతువులపై చేసిన అధ్యయనాల్లో బయటపడింది. దీంతో మనిషి జీవిత కాలాన్ని, ఇంకా వయసును కూడా తెలుసుకోవడానికి ఈ రక్త పరీక్ష ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.