: మతిమరుపుకు మరో కారణం
మతిమరుపు వ్యాధి అల్జీమర్స్‌కు మరో కారణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మన రక్తంలో రాగి మోతాదు పెరగడం అల్జీమర్స్‌కు దారితీస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సహజంగా రాగి మన శరీరానికి అవసరం అని రాగి పాత్రలో రాత్రిపూట నిలవవుంచిన నీటిని తాగడం మంచిదని చాలమంది చెబుతుంటారు. అయితే అతిగా రాగి మన రక్తంలోకి చేరడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదముందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలోని రాచెస్టర్ విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు రక్తంలో రాగి మోతాదు పెరగడం వల్ల అది అల్జీమర్స్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎలుకలు, మానవ మెదడులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. మెదడులో నిత్యం కణచర్యల వల్ల కొన్ని విషపూరిత మాంసకృత్తులు చేరిపోతుంటాయి. వాటిని 'అమీలాయిడ్ బీటా' అంటారు. ఇవి ఎక్కువైతే పాచిలా పేరుకుపోయి అల్జీమర్స్‌కు దారితీస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇవి ఇలా పేరుకుపోకుండా 'ఎల్‌ఆర్‌పీ1' అనే ప్రోటీన్ అడ్డుకుంటుంది. అయితే మన రక్తంలో రాగి మోతాదు పెరిగితే అది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కేశనాళికల్లో చేరి అక్కడే 'ఆక్సీకరణ' ప్రక్రియతో 'ఎల్‌ఆర్‌పీ-1' ప్రోటీను పనితీరును అడ్డుకుంటుంది. దీంతో ఈ ప్రోటీను నిర్వీర్యం అయిపోతుంది. ఇక మెదడులో అమీలాయిడ్ బీటా చేరడానికి అడ్డుండదు. అలా చేరి అది పాచిలా పేరుకుపోయి అల్జీమర్స్‌కు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాగి గొట్టాలనుండి వచ్చే తాగునీరు. కొన్ని పోషకాహార ఔషధాలు, గొడ్డుమాంసం, షెల్‌ఫిష్, కొన్ని పండ్లు, కూరగాయల్లో ఈ రాగిధాతువు ఎక్కువగా ఉంటుంది. ఈ రాగిని మరీ ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.