: కుమార్తె వివాహ ఖర్చుకు వెనకాడని బాలయ్య
సినీ ప్రముఖుల ఇంట పెళ్ళంటే, వేదికలు, ఏర్పాట్లు అన్నీ సినిమాటిగ్గానే ఉంటాయి. పెళ్ళి మండపం నుంచి లైటింగ్, అలంకరణల వరకు అన్నీ సినీ నిపుణుల పర్యవేక్షణలో జరగడం ఇటీవల తరచూ చూస్తున్నాం. తాజాగా, నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని పరిణయ మహోత్సవం కూడా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుతున్నాయి. శ్రీభరత్ తో జరుగుతున్న తేజస్విని వివాహానికి బాలయ్య రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రఖ్యాత కళా దర్శకుడు ఆనంద్ సాయి పర్యవేక్షణలో పెళ్ళి మండపం నిర్మాణం జరుగుతోంది. ఆనంద్ సాయి ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వివాహ వేడుకల్లోనూ తన కళా నైపుణ్యం చాటుకున్నాడు. దీంతో, ఏ సెలబ్రిటీ ఇంట పెళ్ళిబాజాలు మోగాలన్నా ఈయన కళా నిర్ధేశకత్వం తప్పనిసరైపోయింది.
ఇక, బాలయ్య కుమార్తె వివాహ వేదిక వద్ద లైటింగ్ ఏర్పాట్లు సుప్రసిద్ధ కెమెరామెన్ రామ్ ప్రసాద్ కనుసన్నల్లో జరగనున్నాయి. ఈ వేదిక అలంకారం కోసం పువ్వులను బ్యాంకాక్ నుంచి తెప్పిస్తున్నారు. వాటిలో పసుపు రంగు పుష్పాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కాగా, సన్నాహకాల పట్ల ఆనంద్ సాయి మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా ఈ వివాహ మంటపం విషయంలో వినూత్న ఆలోచనకు తెరదీశామన్నారు. గాల్లో తేలుతున్నట్టుగా ఉండే మంటపం అయితే బావుంటుందని బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలకు వివరించానని, అందుకు వారు అంగీకరించారని తెలిపారు.