: ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీ అగ్రనేత అరెస్టు
ఈజిప్టు అల్లర్లలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీ అగ్రనేత మహ్మద్ బడీ అరెస్టయ్యారు. ఆయనతోపాటు పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న యూసఫ్ తలత్, హసన్ మాలిక్ లను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కైరోలోని నాసర్ నగరంలోని టైరన్ వీధిలోఉన్న మహ్మద్ బడీ నివాసంలో ఆ ముగ్గురినీ అరెస్టు చేసినట్టు మీడియా సంస్థలు తెలిపాయి.
అరెస్టు చేసిన వెంటనే వీరిని భద్రతా కారణాలతో తౌరహ్ జైలుకు తరలించారు. ఈజిప్టు అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ మోర్సీ ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న కారణంతో పదవీచ్యుతుడయ్యారు. దీంతో మద్దతుదారులు అతనిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరికి సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వీరిందరికీ ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీ మద్దతునిస్తూ కీలకపాత్ర పోషిస్తోంది.
దీంతో మోర్సీ మద్దతుదారులకు, మోర్సీ వ్యతిరేకులకు మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. వీధులన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఈ ఘర్షణల్లో వేలాదిమంది అసువులు బాసారు. దీంతో ఆ పార్టీ అగ్రనేతలను అరెస్టు చేయాలని ప్రాసిక్యూటర్ జనరల్ అహ్మద్ ఈజీ ఈల్ దిన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరిని అరెస్టు చేశారు. ఇదే జైలులో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్, ఆయన ఇద్దరు కుమారులు ఉన్నారు.