: బ్యాంకు రుణాలు ఇక భారమే
రిజర్వ్ బ్యాంకు చర్యల ఫలితంగా బ్యాంకు రుణాలు భారంగా మారుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంకు ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ద్రవ్య సరఫరాను కట్టడి చేసింది. దీనివల్ల బ్యాంకులకు నిధుల కొరత ఎదురైంది. దీంతో బ్యాంకులు డిపాజిట్ల వేటలో పడ్డాయి. ఇందుకోసం వడ్డీ రేట్లను కూడా పెంచుతున్నాయి. మరి నిధుల సేకరణ వ్యయం పెరిగినప్పుడు బ్యాంకులు ఆటోమేటిగ్గా రుణాలపై కూడా వడ్డీ రేట్లను పెంచక తప్పదు. ఇప్పుడు జరుగుతోంది అదే.
ప్రైవేటు రంగంలోని హెచ్ డీఎఫ్ సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంక్ సహా ఎన్నో బ్యాంకులు 0.25 బేసిస్ పాయింట్ల వరకూ ప్రైమ్ లెండింగ్ రేట్లను పెంచాయి. అంటే దీనివల్ల వాహన, గృహ, ఆటోమొబైల్, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు స్వల్పకాలిక డిపాజిట్లపై 1.50 శాతం వరకూ వడ్డీ రేట్లను పెంచాయి. మిగతా బ్యాంకులు కూడా లెండింగ్ రేట్లను పెంచే యోచనలో ఉన్నాయి.
దేశ ఆర్థిక రంగం మరింత సంక్లిష్ట దశకు చేరుకోవడంతో సమీప కాలంలో రిజర్వ్ బ్యాంకు సరళతరమైన పాలసీని ప్రకటించే అవకాశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కనుచూపు మేరలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. రూపాయి పతనం కూడా ఇంకొంత ఉండవచ్చంటున్నారు. ఫలితంగా రుణాలు తీసుకునే వారు మరింత భారం మోయక తప్పదు.