: హస్తినకేగిన ముఖ్యమంత్రి.. ఎందుకట చెప్మా?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలకు వివరించనున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. ప్రజలు సహా ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి అవాక్కయ్యారు. దీంతో సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. నిర్ణయం వెలువడి 21 రోజులవుతున్నా ఉద్యమంలో కానీ ప్రజల్లో కానీ విభజనపై వ్యతిరేకత తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడకే ముప్పు ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోయినా, ప్రత్యామ్నాయం సూచించినా ఆ ప్రాంతంలో సమాధికాక తప్పదు. దానికి తోడు తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మైలేజీ సాధించలేకపోయింది. జేఏసీ ఇప్పటికీ టీఆర్ఎస్ తోనే అంటకాగుతోంది. టీఆర్ఎస్ లోని కీలక ఎమ్మెల్యేలంతా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. విభజన ప్రకటిస్తే విలీనమైపోతానని కేసీఆర్ గతంలో తాను చెప్పిన మాటలకు తాజాగా కొత్త భాష్యాలు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని తాజా పరిస్థితిని కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు వివరించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.
అయితే, సీఎం ను కాంగ్రెస్ అధిష్ఠానం అకస్మాత్తుగా రప్పించడానికి కారణాలపై ఆ పార్టీ నేతలు పలు విధాలుగా విశ్లేషిస్తున్నారు. రోశయ్యలా నల్లారిని కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ నేతలు అంటుండగా, విభజనపై సీఎం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, అందుకే అసలు ఆయన వాదన ఏంటనేది తెలుసుకునేందుకు మరోసారి పిలిపించారని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు.
సీమాంధ్రలో అన్ని వర్గాలతోపాటు ఉద్యోగులు కూడా ప్రత్యక్ష ఆందోళనల బాటపట్టడంతో అక్కడ పౌర సేవలు స్థంభించిపోయాయి. ఈ పరిస్థితిపైనా సీఎం హైకమాండ్ కు వివరించనున్నారని తెలుస్తోంది. దీనికి తోడు ఈ సాయంత్రం ఆంటోనీ కమిటీని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కలవనున్నారు. ఏది ఏమైనా, సీఎంను అధిష్ఠానం పిలవడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోగుట్టు పెరుమాళ్లు కెరుక!