: బీజేపీ షాపుల్లో ఉల్లి కిలో 40 రూపాయలే..
ఢిల్లీ ప్రజలు ఇప్పుడు బీజేపీ షాపులకు సంచులతో పరుగులు తీస్తున్నారు. కాషాయ జెండాకు జై కొడుతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? మరి, బీజేపీ సామాన్యుల అవసరాలపై అస్త్రాన్ని ఎక్కుపెట్టిందిప్పుడు. దేశ రాజధానిలో కిలో ఉల్లి 70 రూపాయలకు చేరింది. ఈ పరిస్థితితో ప్రజలు ఉడికిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
వచ్చే నవంబర్ లో ఢిల్లీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే శక్తి ఉల్లికి ఉంది. లోగడ ప్రభుత్వాలను మార్చిన ఘనత ఈ ఉల్లి సొంతం. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఢిల్లీ వ్యాప్తంగా 1000 కేంద్రాలు తెరిచి కిలో 50 రూపాయలకే విక్రయిస్తోంది. 150 మొబైల్ వ్యాన్లను కూడా రంగంలోకి దింపింది. కానీ, అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ చక్కగా వినియోగించుకుంటోంది. రేపటి నుంచి 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉల్లి కౌంటర్లు తెరచి కిలో 40 రూపాయలకే విక్రయిస్తామని బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ ప్రకటించారు. ఉల్లి ధరలను నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అన్నట్లు ఈసారి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోతుందని ఇప్పటికే పలు సర్వేలు తేల్చాయి. ఇప్పడు ఉల్లి ఆ ఫలితాలను నిజం చేయనుందన్నమాట.