: మృత్యుంజయురాలు
చావుకు సమీపంగా వెళ్లి చివరికి బ్రతికి బయటపడ్డవారిని మృత్యుంజయులు అని చెబుతారు. మరి చావుకు సమీపంగా కాదు... ఏకంగా చనిపోయాక... ఓ 42 నిముషాల తర్వాత తిరిగి బతికినవారినేమంటారు... సరిగ్గా ఇలాగే ఒక మహిళ విషయంలో జరిగింది. చనిపోయిందనుకున్న సదరు మహిళ 42 నిముషాల తర్వాత చక్కగా బతికింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందం వర్ణనాతీతంగా ఉంది.
41 ఏళ్ల వెనెసా టవాసియో సెల్స్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. గతవారం ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె చనిపోయింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే దమనులు మూసుకుపోవడంతో ఆమె గుండె ఆగి, మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోయింది. దీంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. అయితే చికిత్స చేయడం మాత్రం మానలేదు. లుకాస్-2 అనే ప్రత్యేక పరికరంతో ఆమె గుండెనుండి మెదడుకు రక్తప్రవాహం కొనసాగేలా చేశారు. తర్వాత గుండెలో మూసుకుపోయివున్న దమనులను తెరిచారు. గుండెకు పలుమార్లు వైద్యపరమైన షాక్‌లను ఇచ్చి దాన్ని తిరిగి పనిచేసేలా చేశారు. దీంతో అటు మెదడుకు రక్తప్రసరణ కూడా పునరుద్ధరించబడింది. ఆష్ట్రేలియాలోని మెల్‌బోర్న్ మొనాషా హార్ట్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు చేసిన ఈ వైద్యం వల్ల సుమారు 42 నిముషాల పాటు చనిపోయిన వెనెసా చక్కగా మళ్లీ బతికింది. నిజంగా ఇది చాలా ఆశ్యర్యాన్ని కలిగిస్తోందని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.